Friday 4 December 2015




మేలిముసుగు
=========
నా మేలిముసుగు తీయమని కోరకు
నా ముఖం చూపమని అడగకు
మంచికో చెడుకో నను మరుగున దాచే
ఈ పదాని తొలగించాలని చూడకు .

నేనో అపరిచితను !
పదిహేడేళ్ళకే కుటుంబ బాధ్యతలు నెత్తినేసుకుని
లేత బుజాలమీద మోయలేని బరువులు మోస్తూ
అడుగడుగునా చూపుల అత్యాచారాలకి మాటల తూటాలకి 
సిగ్గుతో చితికి జలపాతాలై కురిసే కళ్ళు చూడాలని కోరుకుంటూ
నా మేలిముసుగు తీయమని కోరకు
నా ముఖం చూపమని అడగకు

నేనో పరిత్యక్త ను !
కోరికలే కొండెక్కి ఆశలన్నీ ఆవిరై పోయి
కలలన్నీ చెదిరి పోయి బంధాలు బరువై పోయి
నావారో పైవారో ఎవరో తెలీని వాళ్ళందరి కోసం అంకితమైన
నా ముఖం లోని ఆవేదన చూడాలని కోరుకుంటూ........
నా మేలిముసుగు తీయమని కోరకు
నా ముఖం చూపమని అడగకు

నేనో ప్రశ్నని
సమాధానం ఉండదు 
నేనో మొండి వ్యాధిని 
ఔషధం దొరకదు
అవ్యక్త గా
అదృశ్య గా
అనామిక గా
అపరిష్కృత గా
అసూర్యం పశ్య గా
నన్నిలాగే మిగిలిపోనీ !

నువ్వు రాముడివే కానీ
నీ పదము సోకని అహల్యగా
నా ప్రియతమా !
ఈ మేలిముసుగు లోనే నన్నుండి పోనీ !







No comments:

Post a Comment